Tuesday, January 5, 2016

   నీవు ఎక్కడ ఉన్నావు?

దేవుడు ఆదామును  అవ్వను సృష్టించిన తరువాత ఆదాము అవ్వ దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు, దీవెనలు, సకల సమృద్ధిని అనుభవిస్తున్న సమయములో ఎందుకో అవ్వకు ఒక కోరిక పుట్టింది - దేవుడు వద్దు అని చెప్పిన పండు తినాలి అని. తరువాత పండు తిన్నది, తాను తినడమే కాకుండా తన భర్తకు కూడా పండు ఇచ్చింది. పండు తిన్న తరువాత మొట్ట మొదటిగా దేవుడు వేసిన ప్రశ్న - నీవు ఎక్కడ ఉన్నావు?

మీరు సమృద్ధిగా జీవించాలని, నాతో సహవాసము కలిగి జీవించాలని, నేను అనుగ్రహించు సంతోషాన్ని మీరు అనుభవించాలని నేను ఎంతో ఆశించాను. మీకు ఏ లోటు ఉండకూడదని, మీకు ఏ కష్టము రాకూడదు అని, మీరు నా బిడ్డలు అని, సకల ఆశీర్వాదాలను దాచిపెట్టి మీకు పంచిపెట్టాను.
ఇది చదువుతున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహొదరీ... సంవత్సరపు ముగింపులో దేవుడు నీకు అదే ప్రశ్న వేస్తున్నాడెమో - నీవు ఎక్కడ ఉన్నావు? సంవత్సరము అంతా నేను నిన్ను ఎంతో దీవించాలి అని ఆశించాను. సంవత్సరము నీ జీవితములో జయ జీవితము చూడాలి అని ఆశించాను. నీ జీవితము దీవెనకరముగా ఉండాలి అని ఆశించాను. నాతో సహవాసము కలిగి, పరిశుద్దత కలిగి, నా కుమారిడిగా, కుమార్తెగా జీవించాలి అని ఆశించాను. కాని నీవు ఎక్కడ ఉన్నావు? పాపిష్టి పని చేస్తూఉన్నావు..చెయ్యకూడని పనులు చేస్తూ ఉన్నావు. చూడకూడని వాటిని చూస్తూ, వెల్లకూడని స్థలాలకు వెళ్తూ ఉన్నావు. నేను అనుగ్రహించిన సమాదానాన్ని పోగొట్టుకున్నావు. నీవు చేసిన పాపిష్టి పనిని బట్టి ఇప్పుడు నీవు దాక్కుంటున్నావు, ఎవరికంట పడకుండా తప్పించుకుని తిరగాలి అని చెప్పి తంటాలు పడుతున్నావు. ఈ రోజు దేవుడు నీతో సూటిగా, స్పష్టముగా ప్రశ్నిస్తున్నాడు. నీవు ఎక్కడ ఉన్నావు? ఎక్కడ దాక్కున్నావు?

ఆనాడు ఆదాము క్షమాపణ కోరడానికి బదులుగా, తన తప్పును ఒప్పుకోవడానికి బదులుగా, తన భార్య మీద తప్పు వేసాడు. అవ్వ తన తప్పును ఒప్పుకోవడానికి బదులుగా సాతాను మీద తన తప్పు వేసింది. తప్పును ఒప్పుకుంటారేమో అని ఆశించిన దేవునికి నిరాశ ఎదురైంది. ఆఖరికి, ఆదాము అవ్వ జీవితాలు దిక్కుమాలిన స్థితికి చేరినాయి.


నా ప్రియ సహోదరుడా, సహొదరీ..నీ తప్పును ఒప్పుకుని క్షమించమని అడుగుతావా? క్షమించడానికి జీవము కలిగిన దేవుడు సిద్దముగా ఉన్నాడు.